- ఏటా 80 టీఎంసీలు లక్ష్యంగా తరలింపు
- 2017లోనే 106 టీఎంసీలు ఎత్తిపోసుకున్న ఏపీ
- మన 45 టీఎంసీల డైవర్షన్ వాటాపై కొర్రీలు
- తెలంగాణ హక్కుపైనే ఏపీ అడ్డగోలు వాదన
- పాలమూరు –రంగారెడ్డికి అడుగడుగునా అడ్డుపుల్లలు
- జీసీ లింక్ మాటున బాబు బ్లాక్‌మెయిల్ ఎత్తుగడ
హైదరాబాద్, వెలుగు: ఎక్కడ అవకాశం దొరికితే అక్కడి నుంచి నీళ్లను ఎత్తుకెళ్లడమే ఏపీ లక్ష్యంగా మారింది. గోదావరి వాటర్ డైవర్షన్‌లో భాగంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుతోనూ మన నీటికి భారీగా గండి కొడుతున్నది. పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వ నుంచి 80 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాకు తరలించేలా 24 పంపులతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో వందల కొద్దీ టీఎంసీలను తోడుకుపోతున్నది. ప్రాజెక్టును ప్రారంభించిన 2016 మార్చి నుంచి ఇప్పటివరకూ.. ఈ పదేండ్లలో 500 టీఎంసీలకుపైగా జలాలను మళ్లించినట్టు అధికారికంగా వెల్లడించింది.
లిఫ్ట్‌ను ప్రారంభించిన తొలినాళ్లలో.. అంటే 2017లో ఏకంగా తరలించాల్సిన దానికన్నా ఎక్కువ నీటిని తోడుకున్నది. ఆ ఏడాది దాదాపు 106 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసింది. ఆ తర్వాత పంపింగ్ తగ్గినప్పటికీ ఈ పదేండ్లలో ఏపీ నీళ్ల వినియోగానికి సంబంధించి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదు. అదే సమయంలో గోదావరి డైవర్షన్‌లో మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్లపై మాత్రం కొర్రీలు పెడుతూనే ఉంది. తాను గొంతు తడుపుకుంటూ.. మన గొంతులను ఎండబెట్టే కుట్రలను కొనసాగిస్తున్నది.
గోదావరి డైవర్షన్‌కు సంబంధించి పట్టిసీమ ద్వారా ఏపీ 80 టీఎంసీల నీళ్లు తరలిస్తే.. ఆ నీళ్లను ఇటు కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణలకు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే గోదావరి ట్రిబ్యునల్పంపిణీ చేసింది. నాగార్జునసాగర్‌కు ఎగువన 45 టీఎంసీలు మనకు (ఉమ్మడి ఏపీ) ఇచ్చేలా తీర్పునిచ్చింది. కర్నాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీల చొప్పున పంపిణీ చేసింది. కానీ, ఆ వాటాల్లో మనకు రావాల్సిన వాటాపై మాత్రం ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ నీళ్లపై మనకు హక్కే లేదంటూ ఇటు ట్రిబ్యునల్‌తోపాటు కేంద్రం ముందు ఏపీ వితండ వాదనలు చేస్తున్నది. ఆ వాటా నీళ్లతోనే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి మన రాష్ట్రం సోర్సుగా చూపించింది.
మరో 45 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్‌లో ఆదా చేసిన నీళ్లను చూపించింది. కానీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచి ఏపీ మనకు అడ్డుపడుతూనే ఉంది. శ్రీశైలం నుంచి అక్రమంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తన్నుకుపోతున్న ఏపీ.. మనం న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల్లోనే ప్రాజెక్టును నిర్మించుకుంటున్నా అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తూనే ఉంది. ఆ ఫలితంగా 2023లో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌లను సెంట్రల్ వాటర్ కమిషన్ వెనక్కి పంపింది. నీటి లెక్కలపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశించింది.
గోదావరి–కావేరి లింక్ మాటున కుట్రలు
మరోవైపు కేంద్రం ప్రతిపాదించిన గోదావరి–కావేరి (జీసీ లింక్)ను తన ప్రయోజనాలకు ఏపీ వాడుకుంటున్నది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మించి తమిళనాడులోని కావేరి నదికి 148 టీఎంసీలను తరలించాలన్నది కేంద్రం ఆలోచన. కానీ, ఇప్పుడు దానిని రద్దు చేసి తాము పోలవరం ఆధారంగా నిర్మించతలపెట్టిన పోలవరం–బనకచర్ల నుంచి నీటిని తీసుకుపోవాలని ప్రతిపాదిస్తున్నది. దానికి ప్రతిఫలంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒప్పందం చేసుకునేందుకూ అంగీకారం తెలుపుతున్నట్టుగా చెబుతున్నారు.
అంటే పాలమూరు–రంగారెడ్డిని అడ్డుపెట్టుకొని ఏపీ మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ.. జీసీ లింక్ ద్వారా 200 టీఎంసీలను అప్పనంగా.. హక్కుగా కొట్టేసేందుకు కుట్రలు చేస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇటీవల కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమైన సమయంలో.. ఏపీ వాదనలను కొట్టిపారేశారని తెలిసింది. తాజాగా చంద్రబాబుతో భేటీలో సీఆర్ పాటిల్ ఇదే విషయం చెప్పారని సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి జీసీ లింక్ మార్పునకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదని, సమ్మక్కసాగర్ ద్వారా తెలంగాణకు వచ్చే హక్కులను వదులుకునేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేసినట్టు తెలిసింది. దాంతోపాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపైనా ఏపీ చేస్తున్న వాదనలనూ కొట్టిపారేశారని చెప్పినట్టు సమాచారం.
కేంద్రానికి మళ్లీ అదే ఫిర్యాదు
మూడు రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్రజలశక్తి శాఖ మంత్రి సీఆర్‌పాటిల్‌తో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ సందర్భంగా గోదావరి–కావేరి లింక్‌ను తెరపైకి తెచ్చారు. మన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మీద కూడా అభ్యంతరాలు తెలిపినట్టు జలశక్తిశాఖ తెలియజేసింది.
గోదావరి డైవర్షన్‌లో వచ్చే 45 టీఎంసీలకు తెలంగాణకు హక్కు లేదని, తేల్చాల్సింది ట్రిబ్యునల్ అని వాదిస్తూ.. ఆ ప్రాజెక్టుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొద్దని కోరారని తెలిపింది. ఆ క్రమంలోనే కేంద్రం కూడా అదే స్థాయిలో పాలమూరు–రంగారెడ్డికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నది. డీపీఆర్‌లను ఆమోదించలేమని, ఏపీతో ఒప్పందం చేసుకోవాలని కొద్ది రోజుల క్రితం మన అధికారులకు సీడబ్ల్యూసీ అధికారులు ఉచిత సలహాలు ఇచ్చారని చెబుతున్నారు.
